- కాషాయ జెండాలు పాతి.. పేదలకు పంచుతం
- 60% మందికి భూమి లేదు.. నేతలకు వేల ఎకరాలా?
- ఫాంహౌస్‌లో సర్కార్ భూమి ఉందని తేల్చేందుకు 33 నెలలు పట్టిందా?
- సీఎం తీరును తప్పు పట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- సీఎం తీరును తప్పు పట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లు ఆక్రమించిన భూముల్లో కాషాయ జెండాలు పాతి పేదలకు పంచుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. త్వరలో ఆ భూములపైకి బీజేపీ ఆధ్వర్యంలో దండయాత్ర చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందని, యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. కరీంనగర్ లోని మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో గణేశ్ నిమిజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేల భూబాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పడితే మరి 90 మంది ఎమ్మెల్యేల భూబాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సర్కార్ భూమి ఉందని తేల్చడానికి 33 నెలలు పట్టిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి గజం జాగా కూడా లేదని, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని మండిపడ్డారు.
పాదయాత్రలో తాను బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ నా తలను ఆరు ముక్కలు చేస్తానన్నారని సంజయ్ గుర్తు చేశారు. అయినా కేసీఆర్ మెడలు వంచి ఫామ్‌హౌస్ నుంచి గుంజకొచ్చి ప్రజల ముందుంచానని అన్నారు. బేరాలు కుదరగానే సిట్ ను నీరుగార్చడం సీఎంకు అలవాటేనన్నారు. కలెక్టర్లకు పూర్తి అధికారాలిస్తే 24 గంటల్లో పూర్తి నివేదిక ఇస్తారని, 30 రోజుల గడువు పేరుతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం, గొర్రెల స్కామ్ సహా కేసులన్నీ ఏమయ్యాయన్నారు.
పేదలు ఫారెస్ట్ ల్యాండ్స్ లో సాగు చేస్తే నానా ఇబ్బందులు పెడతారని, కానీ వందల ఎకరాల ఫారెస్ట్ భూమిని కబ్జా చేస్తే చర్యలేవని ప్రశ్నించారు. తెలంగాణకు బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేస్తే.. వాటికి కేటాయించిన భూములను సైతం బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని తెలిపారు. బండి సంజయ్ వెంట కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు ఉన్నారు.
